డిసెంబర్ 13, 2025 న ప్రారంభోత్సవ సమావేశం తో మీ ముందుకు వచ్చిన బోస్టన్ తెలుగు సాహిత్య వేదిక లక్ష్యం తెలుగు భాష వాడుకని ప్రోత్సహించడం, అంటే తెలుగు వినడం, చదవడం, రాయడం ప్రోత్సహించడం. శక్తివంచన లేకుండా తరతరాల తెలుగు సాహిత్యాన్ని సంరక్షిస్తూ, విస్తృత వ్యాప్తి చేస్తూ ముందు తరాల వాళ్లకు అందుబాటులోకి తీసుకురావడం.

ఏ ఇజానికి ఏ చట్రానికి పరిమితం కాకుండా సృజనాత్మకత తో వీలైనంతగా అందరిని కలుపుకొని భిన్న దృక్పథాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా ముందుకు సాగడం.

ప్రవాసం, మన అనుబంధం

ప్రవాసం ఒక ప్రహసనం. జీవనోపాధికో, మెరుగైన జీవితానికో, ప్రపంచాన్ని శోధించడానికో లేదా మనల్ని మనం పరిశోధించుకోవడానికో.. కారణం ఏదైనా రెక్కలు కట్టుకున్న ఆశయాలతో, కోటి కలలు నింపుకున్న కళ్లతో మనది కాని దేశంలో మనదైన ప్రతిభతో గెలవడానికి అడుగుపెట్టాం.

ఈ క్రమంలో దైనందిన జీవితంలో, జీవన సంఘర్షణలో, ఎదుగుదలలో మనతనాన్ని అనునిత్యం గుర్తుకుతెచ్చేది మనభాషే. మన మూలలకి మనల్ని కలిపి ఉంచే ఒక అంతఃసూత్రం, మన మాతృభాష.

మా దృష్టి

బోస్టన్ తెలుగు సాహిత్య వేదిక తెలుగు సాహిత్యం లో తరాల అంతరాన్ని తగ్గించే భాషా సంస్కృతికి వారధిలా, భిన్న స్వరాలు సంగమించే జలధిలా, భాషాభిమానులను అనుసంధాన పరిచే ఒక చక్కని వేదిక కావాలని ఈ ప్రయత్నం.

దగ్గరితనం, మా బలం

భాష అంటే కొందరికి తమ భావాలను వ్యక్తం చేసే ఒక సాధనం కావచ్చు. మరికొందరికి తమ అస్తిత్వానికి గుర్తింపు కావచ్చు. చాలా సంస్థలు, భాష కోసం పాటుపడే సంఘాలు, కూటములూ ఉన్నా భౌతికంగా మనకు దగ్గరలో అందుబాటులో ఉంటూ చదువరులను, శ్రోతలను, రచయితలను క్రమానుగతంగా క్రియాశీలకంగా పాల్గొనే లా చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని మా ఉద్దేశం.

ప్రకాశవంతమైన నక్షత్రం కూడా దూరంగా ఉంటే మిణుకు మిణుకుమంటూనే కనిపిస్తుంది. ఆ దూరం దగ్గర అయితే దాని మిరిమిట్లు కొలిపే వెలుగు మనల్ని ఎంతో తేజోవంతులుగా నిలుపగలదు కదా.

మా కార్యాచరణ

అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకు తెలుగు సాహిత్యం అందించడం, ఇక్కడి రచయితలకు వేదిక కల్పించడం, భారతదేశం నుండి వచ్చే ప్రముఖ సాహిత్యకారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ మా కార్యాచరణలో భాగం.

కార్యవర్గం

  • శ్రీ శరత్ చంద్ర మహావాది
  • శ్రీమతి శ్రేష్ట జొన్నలగడ్డ
  • శ్రీ పాణిని జన్నాభట్ల
  • శ్రీమతి దీప్తి గోర

సలహా మండలి

  • బదరీనథ్ విస్సాప్రగడ

మాతో కలిసి పనిచేయండి

సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ స్వాగతం.

సభ్యులుగా చేరండి